పరిణితిలేని మనసులపై ప్రభావం
మతం మారాలంటూ నూరిపోస్తున్నారు
క్రైస్తవ స్నేహితుడిగా చెబుతున్నా
బలవంతపు మార్పిడులు నిషేధించండి
పోప్ బెనెడిక్ట్‌కు స్వామి అగ్నివేశ్ లేఖ
బలవంతపు మత మార్పిడులపై 'నిషేధం' విధించాలంటూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పోప్ బెనెడిక్ట్-16ను కోరారు. ఇటువంటి మత మార్పిడులతో భారత్ వంటి దేశాల్లో తీవ్ర స్పందనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి సందర్భంగా స్వామి అగ్నివేశ్‌కు పోప్ ఓ లేఖ రాశారు. 'మతం మారే స్వేచ్ఛ'కు ఆ లేఖలో పోప్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. దానికి స్పందనగానే అగ్నివేశ్ లేఖ రాశారు.
ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ.. దీపావళి సందర్భంగా హిందువులతో పరస్పర చర్చలకు పిలుపునిస్తూ పాంటిఫికల్ కౌన్సిల్ పంపిన సందేశం అందింది. దానికి స్పందనగానే ఈ లేఖ రాస్తున్నాను. మీకు, మరీ ముఖ్యంగా భారత్‌లోని క్రైస్తవులకు స్నేహితుడిగా ఈ లేఖ రాస్తున్నా! హిందువులు సహా ఇతర మతాల్లోని ఛాందసవాదులు దాడులు చేసినప్పుడు క్రైస్తవుల తరఫున పోరాడిన వారిలో నేనే ముందు వరుసలో ఉంటాను.
మీ సందేశం చదివిన తర్వాత దానిలోని కొన్ని అంశాలు నాలాంటి శ్రేయోభిలాషులను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. మత స్వేచ్ఛ ఉండాల్సిన ఆవశ్యకతను ఆ సందేశంలో మీరు బాగా వివరించారు. దానిని వివిధ కోణాల్లో పరిశీలిస్తే.. 'మత స్వేచ్ఛ అంటే ఒకరి మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ కూడా' అని మీరు పేర్కొన్నారు. దీనిపై కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
లేకపోతే.. ఎవరు ఏ మతాన్ని అయినా విశ్వసించవచ్చు, ఆచరించవచ్చునన్న మీ సందేశానికి బదులుగా మత మార్పిడులను సమర్థిస్తున్నారనే భావన కలుగుతుంది. భారత్ వంటి దేశాల్లో ఈ భావన తీవ్ర స్పందనలను రేకెత్తిస్తుంది. ముల్లాలు, మిషనరీలు ప్రచారం చేస్తున్న విశ్వాసాలను నమ్మకపోతే, సొంత విశ్వాసాలను వదలకపోతే ప్రజలు తమను తాము రక్షించుకోలేరని ఇప్పటికే అనేక మంది వ్యక్తులు, సంస్థల వారు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారి చేతిలో మేము ఇప్పటికే చాలా బాధలు పడి ఉన్నాం. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. పోప్ జాన్‌పాల్-2 1999లో భారత్‌కు వచ్చారు. బిషప్‌లను, కార్డినల్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు.
"మొదటి మిలీనియంలో యూరప్ గడ్డపై శిలువను ప్రతిష్ఠించగలిగాం. రెండో మిలీనియంలో అమెరికా, ఆఫ్రికాల్లో ప్రవేశించాం. మూడో మిలీనియంలో సువిశాల, ప్రాణాధారమైన భారత ఉప ఖండంలో విశ్వాసమనే పంట పండుతుందని ఆశిస్తున్నాం'' అని పోప్ ప్రకటించారు. రక్షకుడైన ఏసుక్రీస్తుపట్ల అచంచల విశ్వాసం ఉందని ఆ సందేశం చెబుతోందని, మత మార్పిడులకు అది పిలుపునిస్తోందని మాకు చెప్పారు.
అంతేనా.. "ప్రభువు నుంచి మొత్తం ఆసియా శాంతి పొందే దాకా చర్చి హృదయం తల్లడిల్లుతూనే ఉంటుంది'' అని కూడా పేర్కొన్నారు. ఈ సందేశం ద్వారా - మత స్వేచ్ఛ అంటే మత మార్పిడులు చేయడానికి మిషనరీలకు ఉన్న స్వేచ్ఛ అని అర్థమవుతుంది. అయితే, మీరు, మేము చేయబోయే పర్యటన లక్ష్యాలకు ఇది విరుద్ధంగా ఉంది. ఆ యాత్రకు శాంతి, సత్యం ప్రధాన లక్ష్యాలని మీరు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా మా సుప్రీం కోర్టు కూడా కొన్ని మార్గదర్శకాలను ప్రవచించింది. వీటి ప్రకారం- మత ప్రచార స్వేచ్ఛ అంటే మత మార్పిడులు చేయడానికి స్వేచ్ఛ ఉన్నట్లు కాదు. ఈ మార్గదర్శకానికి వెనక కొన్ని కారణాలు ఉన్నాయి.
పేద ప్రజలకు ఉన్న ఇబ్బందులను సాకుగా చూపించి చాలాసార్లు తమ తమ మతాలను వదిలిపెట్టేలా వారిని రెచ్చగొడుతున్నారు. చర్చి చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే- తీవ్రమైన కరువు పరిస్థితులను కూడా ఉపయోగించుకొని తమ మతాన్ని ప్రచారం చేసుకొన్న ఉదం తాలు కనిపిస్తాయి. హిందూ దేవతలు, దేవుళ్లపై అమాయక పేదలకు అనేక రకాలైన దుష్ప్రచారాలనూ నూరిపోస్తున్నారు.
అద్భుతాలు చేస్తామని, మహిమలు చూపిస్తామని క్రైస్తవ మత ప్రచారకులు ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి మహిమల మాట పక్కన పెడితే- భారత దేశంలో వెనకబడిన కులాల ప్రజలకు సమానత్వాన్ని కూడా కల్పించలేకపోతున్నారు. ఈ విషయంపై మత మార్పిడి చేసుకున్నవారు పుంఖానుపుంఖాలుగా రాశారు.
చాలాసార్లు మత మార్పిడులు చాలా గర్హించదగ్గ పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని మీ సందేశంలో కూడా ఖండించారు. ఈ తరహా మత మార్పిడులు వ్యక్తులను చాలా సందిగ్ధంలో పడేస్తాయి. అండగా ఉండే సమాజాల నుంచి వారిని వేరు చేస్తాయి. పెద్ద సంఖ్యలో మత మార్పిడులు జరిగినప్పుడు- ఆ ప్రజలు తాము నివసిస్తున్న సమాజానికి దూరంగా జరుగుతున్నారు. దీనివల్ల క్రైస్తవ మత ప్రచారకులకు, గ్రూపులకు వ్యతిరేకంగా హింస చెలరేగుతోంది. ఇలాంటి వాటి వల్ల సహ జీవనం, ప్రశాంతత దెబ్బతింటున్నాయి.
ప్రతి వ్యక్తికి ఇతర మతాల గురించి తెలుసుకొనే హక్కు ఉంటుందనే మీ వాదనతో ఏకీభవిస్తున్నాను. అయితే, అది స్వేచ్ఛతో, ఆ వ్యక్తి స్వయంగా తీసుకున్న నిర్ణయమై ఉండాలి. అది ప్రలోభాలతో కూడినదై ఉండకూడదు. ఒత్తిళ్లతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అబద్ధాలతోను, తప్పుడు హామీలతోను దానిని ముందుకు నడిపించకూడదు. ఇలాంటి మత మార్పిడులు జరిగినప్పుడు తీవ్రమైన స్పందనలు వస్తాయి. దీనివల్ల సమాజంలో ఉద్రిక్తతలు ఏర్పడతాయి. హింసాపూరితమైన స్పందనలు వస్తాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మీ సందేశంలో చెప్పిన అంతఃస్సూత్రం కాకుండా.. మూకుమ్మడి, బలవంతపు మత మార్పిడులపై నిషేధం విధించాలని కోరుతున్నాను. ముఖ్యంగా-ఎవరికైతే పరిణతి ఉండదో.. ఎవరైతే సొంత నిర్ణయాలు తీసుకోలేరో వారిని మత మార్పిడులు చేయకుండా నిషేధించాలని కోరుతున్నాను. చదువుకోని ఆదివాసీ కానీ, ఒక చిన్న పిల్లవాడు కానీ తమ మతం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలరు?
ఇలాంటి నిషేధం వల్ల మిగిలిన మతాలకు చెందిన ప్రజలకు కొంత వ్యవధి చిక్కుతుంది. వారు తమ ఆలోచనలను పునరాలోచించుకోగలుగుతారు. వివిధ సంస్థలు తమ పనితీరును సమీక్షించడానికి వీలవుతుంది. ఈ సమయంలో నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు వ్యక్తులకు ఉంటుంది. వేరే మతాన్ని ఆదరించాలని వారి అంతరాత్మ చెబితే వారు దానినే పాటిస్తారు. మన సమావేశంలో ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నా.
Courtesy : Andhra Jyothy
No comments:
Post a Comment