హైదరాబాద్, నవంబర్ 9: విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధోరణిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. విశాఖ స్వామి అభిమానులూ, భక్తులూ అధికారుల ధోరణిపై విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తీరుపై దేవాదాయ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సైతం మండిపడ్డారు. స్వామిపై ఇఓ వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి పొన్నాల ముఖ్యకార్యదర్శి రమణాచారిని ఆదేశించారు. పవిత్రమైన ప్రదేశాల్లో అనుచిత ప్రవర్తనకు తావు లేదని మంత్రి అన్నారు. బుధవారం రాత్రి మంత్రి పొన్నాల ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ధర్మానికి, సంప్రదాయానికి విరుద్ధంగా ఏ అధికారి వ్యవహరించినా సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. సంప్రదాయాలను పరిరక్షించే స్వాములు, పీఠాధిపతుల విషయంలో దేవాదాయ సిబ్బంది నిగ్రహంగా వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు.
విశాఖ స్వామి తన శిష్యులతో సోమవారం మల్లన్న దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో సిబ్బంది ఆగమ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించడంపై స్వామీజీ ప్రశ్నించినట్టు తెలిసింది. దానిని సహించలేకపోయిన సిబ్బంది శ్రీశైలంలోని స్వామి ఆశ్రమంపై దాడి చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారాలపై స్వామి ‘ఆంధ్రభూమి’కి వివరణ ఇస్తూ, శివుని అభిషేకం ఆగమ సంప్రదాయానికి విరుద్ధంగా జరుగుతోందని, స్పర్శదర్శనానికి అనుమతించకపోవడంతో పాటు, అభిషేకానికి అనుసరిస్తున్న పద్ధతి కూడా సవ్యంగా లేదని అన్నారు. శ్రీశైలంలో అన్యమత ప్రచారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్వామి ఆరోపించారు. ఇది హిందూ వ్యవస్థపై ఒక విధంగా దాడి చేయడమేనని, దేవాదాయ శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అధికారి వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు.
ఇఓ తీరు దారుణం: ద్రోణంరాజు రవి
దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది భక్తుల పట్ల, స్వాముల పట్ల అనుచితంగా వ్యవహరించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవి అన్నారు. స్వామీజీ పట్లే అధికారులు అనుచితంగా వ్యవహరిస్తే సామాన్య భక్తుల మాటేమిటని ప్రశ్నించారు. మతవిశ్వాసాలను గాలికొదిలి అన్యమతస్థుడిగా వ్యవహరిస్తున్నారని, ఇఓపై సెక్షన్ 295 ఎ ప్రకారం కేసు పెట్టి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇఓపై అధికారుల వైఖరిని బిజెపి అధికార ప్రతినిధి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.
http://www.andhrabhoomi.net/state/p-924-0
No comments:
Post a Comment