Sunday, February 5, 2012

మన సంస్కృతి, వారసత్వం పట్ల గర్వపడదాం

ఐదు  వేల  సంవత్సరాలు పైగా చరిత్ర కలిగిన జాతి మనది. కేరళలో ఎక్కడో ఒక కుగ్రామంలో జన్మించిన శంకరాచార్యులకు దేశమంతా రెండుసార్లు కాలినడకన తిరిగేందుకు ప్రేరణ మన, మనదేశం అనే భావన. అటువంటి దేశంలో జన్మించిన మనం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాలనకు మనం ఏర్పాటు చేసుకొన్న రాజ్యాంగము ఏ రకంగా రచించుకున్నాము, దానికి ప్రేరణ ఏమిటి అని ఆలోచిస్తే మనం ఇప్పుడిప్పుడే ఒక జాతిగా రూపొందుతున్నామనే భావన ప్రేరణగా ఉన్నట్లు అనిపిస్తున్నది.

1) వేల సంవత్సరాలుగా ఈ దేశానికి భారత్ అని పేరు ఉంటే రాజ్యాంగంలో "ఇండియా" అని వ్రాశారు. దానిపై ఆందోళన వ్యక్తమైన తరువాత "ఇండియా దటీజ్ భారత్" అని వ్రాశారు.

2) వేల సంవత్సరాల ఈ దేశంలో పాలనా వ్యవస్థలో రాజులు తమ పతాకంగా కాషాయవర్ణ పతాకం ఉండేది. దానిమీద తమ గుర్తు ముద్రించుకోనేవారు. స్వాతంత్ర్యం తరువాత ఏర్పాటు చేయబడిన జెండా కమిటీ సూచించింది కూడా కాషాయ పతాకం మీద నీలం రంగులో రత్నం గుర్తు ఉండాలని చెప్పింది. దానిని తిరస్కరించి త్రివర్ణ పతాకం జాతీయ పతాకంగా స్వీకరించాం.

3) ప్రపంచంలోని ఏ దేశమూ నిర్వచించని విధంగా ఈ దేశంలో మతం ఆధారంగా మైనార్టీలను నిర్వచించుకొన్నాం. ముస్లింలు, క్రైస్తవులను మైనార్టీలుగా పేర్కొన్నాం. దానితో వాళ్ళను తమ ఓటు బ్యాంకులుగా రాజకీయ నాయకులు మలచుకొన్నారు.

4) ఈ దేశంలో అనేక మతాలూ, సంప్రదాయాలున్నాయి. అయినా భగవంతుడు ఒక్కడే. అతనిని చేరేందుకు వివిధ మార్గాలు అనే సత్యం గుర్తించిన జాతి మనది. అందుకే సర్వపంథ సమభావన అంటాము. ఇటువంటి స్ఫూర్తివంతమైన ఆలోచనను ప్రక్కనపెట్టి 1976లో సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దానికి నిర్వచనం చెప్పరు. నేడు దేశంలో అత్యధికంగా దుర్వినియోగమవుతున్న పదం సెక్యులరిజం.

ఈ విధంగా అనేక అపోహలు నిర్మాణం చేయటానికి దారులు చూపించేట్లుగా ఉన్నది మన రాజ్యాంగం. జాతీయ సమైక్యతకు ప్రేరణగా దానిని మలచలేకపోయాం. పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసుకొన్నాము. అయినా మన దేశంలో బీదరికాన్ని వదిలించుకోలేక పోతున్నాము. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ దేశమంతటిని అనుసంధానం చేయగలిగే భాషను వికశింప చేసుకోలేక పోయినాము. ఈ రోజుకీ ఆంగ్లమే ఈ దేశాన్ని ఏలుతున్నది.

జాతీయ సమైక్యతా భావన ప్రజల హృదయాలలో జనిస్తున్నది. అది అక్కడ మరణిస్తే ప్రభుత్వం కాని, సైన్యాలు కాని దానిని రక్షించలేవు. ఈ రోజున భారతదేశం భారతీయ ఆత్మ ఐక్యత కోసం అత్మీయకరణ కోసం తహతహలాడుతున్నది. మన వేల సంవత్సరాల సంస్కృతి, వారసత్వం పట్ల మనం గర్వపడాలి. ఆ స్ఫూర్తే ఈ రోజున దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఇది సాధించుకోనేందుకు మన తల్లియైన భారతమాతకు అందరం జనవరి 26 నాడు పూజిద్దాం. ఈ దేశం అంటే గర్వపడే ప్రేరణ పొందుదాం.   


 http://www.lokahitham.net/2011/12/blog-post_04.html

No comments:

Post a Comment