Thursday, November 24, 2011

మేము భారత్‌లోనే ఉంటాం! - ఢిల్లీలో మాకు వసతి కల్పించండి కేంద్రానికి 140 మంది పాక్ హిందువుల మొర

November 24th, 2011

న్యూఢిల్లీ, నవంబర్ 23: తమ దేశంలో వివక్షకు గురవుతూనే బతకాల్సి వస్తుందన్న భయంతో సుమారు 140 మంది పాకిస్తానీ హిందువులు ఢిల్లీని తమ నివాసంగా చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. సింధ్ రాష్ట్రానికి చెందిన వీరంతా టూరిస్టు వీసాపై భారత్ వచ్చారు. ఆ వీసా గడువు ఇప్పటికే ముగిసిపోయింది కూడా.

అయితే వీళ్లంతా తమ జన్మస్థలంలో బతుకు దుర్భరంగా ఉంటుందన్న భయంతో మళ్లీ అక్కడికి తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. రెండు నెలల క్రితమే తమ వీసా గడువు ముగిసిపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న సింధ్ రాష్ట్రంలోని మతియారీ జిల్లా గ్రామానికి చెందిన ఈ 27 కుటుంబాలు భారత్‌లో అయితే తామంతా సురక్షితంగా ఉంటామని భావిస్తున్నారు.

ప్రస్తుతం వీళ్లంతా ఉత్తర ఢిల్లీలోని మజ్నూకా తిల్లా ప్రాంతంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన టెంట్లలో ఉంటున్నారు. తమ వీసాలను పొడిగించి నగరంలో తమకు తగిన వసతి సదుపాయం కల్పించాలని వీరంతా ముక్తకంఠంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల పాటు ఎదురు చూసిన తర్వాత టూరిస్టు వీసా సంపాదించిన వీరంతా సెప్టెంబర్ 2న కాలి నడకన సరిహద్దులను దాటి రెండు రోజుల తర్వాత ఢిల్లీ చేరుకున్నారు. తాము ఈ విషయమై ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, కాణగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసామని, అయితే ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న గంగారామ్ చెప్పారు. పాకిస్తాన్‌నుంచి భారత్ చేరుకునే దాకా తన కథనంతా వివరించిన ఇరవై ఏళ్ల జమున కనీసం తన పిల్లలయినా ప్రశాంత వాతావరణంలో మెరుగయిన జీవితాన్ని, విద్యను పొందుతారన్న ఆశతో ఉన్నట్లు చెప్పింది.

‘పాకిస్తాన్‌లో మత స్వేచ్ఛ లేదు. హిందువులను చదువుకోవడానికి అనుమతించరు. మాపై ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి. భారత దేశానికి వచ్చి ఇక్కడే స్తిరపడిపోవాలనే ఉద్దేశంతో వీసా కోసం ఎదురు చూస్తున్నాం. ఏది ఏమయినా మేము తిరిగి వెళ్లం’ అని కుటుంబ సభ్యులు, స్నేహితులు చుట్టుముట్టి ఉండగా, ఆరుబయటే రొట్టెలు చేస్తున్న జమున చెప్పింది. డేరా బాబా ధున్నీదాస్ ఈ 27 కుటుంబాలకు వేర్వేరుగా టెంట్లు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, ఇతర సరకులు సరఫరా చేస్తూ ఉంది. ఈ కుటుంబాల్లో యువకులే కాకుండా వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది యువకులు దగ్గర్లో ఉన్న దుకాణాల్లో పనులు చేయడం కూడా ప్రారంభించారు. ‘్భరతీయులు తమకు సాయం చేస్తారు’ అన్న ఏకైక ప్రార్థనతో తామంతా కొంపా గోడు, పశువులు అన్నీ వదిలిపెట్టి కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చామని జమున చెప్పింది.

తామెందుకు పాకిస్తాన్ వదిలి పారిపోయి వచ్చామో చందెర్మా అనే 40 ఏళ్ల మహిళ వివరించింది.‘ పిల్లలు బడికి వెళితే వేరుగా కూర్చోబెడుతున్నారు. వాళ్లకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు. మేము అనునిత్యం భయంతో కూడిన వాతావరణంలో జీవించాలనుకోవడం లేదు. అందుకే మేము టూరిస్టు వీసాపై ఇక్కడికి వచ్చాం’ అని ఆమె చెప్పింది. స్థానికులు తమ ఖర్చులను భరిస్తున్నారని ఆమె చెప్తూ, తమ వీసాలను పొడిగించి తమ పిల్లలు చదువులు కొనసాగించడానికి వీలుగా తమకు తలదాచుకోవడానికి గూడును ఏర్పాటు చేయాలని మాత్రమే తాము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ఆమె చెప్పింది. 13 ఏళ్ల ఆర్తీ కథ ఎవరినైనా కదిలించకమానదు. ఆ అమ్మాయి ఎప్పుడూ బడికి వెళ్లి చదువుకోలేదు కానీ తన తాత, నాన్నమ్మ దగ్గరనుంచి హిందూ మంత్రాలను నేర్చుకుంది. ఓ పక్క కుటుంబానికంతటికీ వంట చేస్తూనే మరో పక్క తాను నేర్చుకున్న మంత్రాలను క్యాంప్‌లోని చిన్నారులకు నేర్పిస్తోంది. ‘నేను నేర్చుకున్న దాన్ని నా స్నేహితులకు నేర్పించడం ద్వారా నా ఒత్తిడిని మరిచిపోతున్నాను’ అని ముక్కుపచ్చలారని ఆ చిన్నారి చెప్తూ ఉంటే ఎవరికయినా కళ్లు చెమర్చకమానవు. కాగా, భారత దేశంలో వేలాది మంది బంగ్లాదేశీయులు, నేపాలీలు, టిబెటన్లు ఉన్నప్పుడు హిందువులైన తాము ఇక్కడ ఎందుకు ఉండకూడదని ఆమె సోదరుడు ప్రశ్నిస్తూ, తాము ఇక్కడే తమ జీవితాలను కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలని అన్నాడు.
 http://www.andhrabhoomi.net/national/m-881

No comments:

Post a Comment