Thursday, November 17, 2011

ప్రచారమా.. ప్రలోభమా? - ఆంధ్ర జ్యోతి కథనం - 2 - వివాదాస్పదమవుతున్న మత మార్పిడులు

వివాదాస్పదమవుతున్న మత మార్పిడులు
అగ్ర వర్ణాలలో పెరుగుతున్న ధోరణి

హైదరాబాద్, నవంబర్ 10 : 
  • తమది ప్రచారం మాత్రమే అంటారు వాళ్లు.
  • దాని వెనక ప్రలోభం దాగి ఉంది.
  • కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తప్పేముంది అంటారు వాళ్లు.
  • ఆదుకునే పేరుతో అమాంతంగా మతం మార్చేస్తున్నారు!
ఏది నిజం? దేనిలో ఎంత వాస్తవం? రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిడులను లోతుగా పరిశీలిస్తే పై రెండు వాదనల్లోనూ వాస్తవం ఉందని తేలుతోంది. రాజ్యాంగం ప్రకారం మత ప్రచారం చేసే హక్కు, నచ్చిన మతంలోకి స్వచ్ఛందంగా మారే హక్కూ ఎవరికైనా ఉన్నప్పటికీ, జరుగుతున్న సంఘటనలు అంత సాఫీగా సాగిపోతున్నట్టు కనిపించడం లేదు. అనేక సందర్భాల్లో 'తీవ్రమైన ప్రచార ఒత్తిడి'కి లోనైన వారు క్రైస్తవంలోకి మారిన ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి.

'సమస్య లేని సమాజం, ఇబ్బంది లేని మనిషి ఎవరుంటారు? ఆ ఇబ్బందిని పరిష్కరించుకోవడానికి సాయపడడం మానవత్వం. ఆ ఇబ్బందిని పరిష్కరిస్తాం. మా మతంలోకి రండి అనడం షరతులతో కూడిన ప్రలోభం. క్రైస్తవం మతాంతరీకరణ అంశంలో మామూలు ప్రచారంతో పాటు రెండోదీ ఉధృతంగా సాగుతోంది'' అని ఒక సామాజిక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒకప్పుడు హిందూమతంలో ఉన్న వివక్షను, సామాజిక అంతరాలను ఎదిరించడానికి, అగ్ర కులాల దుర్మార్గాల నుంచి తప్పించుకోవడానికి దళిత వర్గాలు మత మార్పిడిని ఎంచుకున్నాయి. స్వచ్ఛందంగా మతాన్ని మార్చుకున్నాయి.

ఇందులో ఎలాంటి తప్పూ లేదు. దీన్ని ఎవరూ తప్పుబట్టలేరు కూడా. అంతెందుకు; భారత సమాజంలో దళితులు ఎదుర్కొనే వివక్షకు 'మతం మారడమే మందు' అని దళిత జనోద్ధారకుడు, రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ తేల్చి చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో 1956 అక్టోబర్ 14న ఐదు లక్షల మంది దళితులు హిందూ మతం నుంచి బౌద్ధంలోకి మారారు. వివక్షను ఎదుర్కొనే అణగారిన వర్గాల వారికి అంబేద్కర్ ఈ పరిష్కార మార్గాన్ని చూపించారు. అయితే సామాజికంగా ఎలాంటి వివక్షకు లోను కాని వారు, పై అంతస్తులో ఉన్నవారు కూడా మతం మారుతుండడం ఇటీవలి కాలంలో కనిపిస్తున్న పరిణామం. అగ్రవర్ణాల వారైనా, మరెవరైనా స్వచ్ఛందంగా మారితే సమస్యే లేదు.

కానీ అసలు విషయమేమిటంటే... పలు సందర్భాలలో ఇతరత్రా కారణాలు వారిపై ప్రభావం చూపుతున్నాయి. వికసించీ వికసించని మనసులను అనేక ప్రలోభాలకు గురి చేసి, ప్రభావితం చేసి మతం మార్పించుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. మత మార్పిడులపై ప్రచురించిన 'దేవుడు పిలిచాడు' కథనాన్ని చదివి, వరదరాజులు అనే బీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి తనంతతానుగా ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఫోన్ చేశారు. తన కూతురిని ఇలాగే ప్రలోభ పెట్టి, నన్‌గా మార్చారని ఆవేదన వ్యక్తంచేశారు. పాత్రికేయ రంగంలో లబ్ధ ప్రతిష్ఠుడైన, అగ్ర కులానికి చెందిన ఒక ప్రముఖుడి కూతురితో కూడా మతం మార్పించేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి.

కానీ సఫలం కాలేదు. ఇదే తరహాలో విశాఖపట్నానికి చెందిన కుటుంబం విషయంలో మత మార్పిడి జరిగిపోయింది. ఇది వివక్షకు అందని కోణం. 'ఎందుకిలా?' అని ప్రశ్నిస్తే ఆరోగ్యం బాగుపడుతుందని, ఆర్థికంగా బాగుంటుందని... రకరకాల సమాధానాలు వినవస్తున్నాయి. వ్యక్తులు, చట్టాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... మత మార్పిళ్లపై ఘర్షణలు జరుగుతున్న సందర్భాలూ అనేకం! కుటుంబాల స్థాయిలో ఆవేదనను మిగిల్చిన ఉదంతాలూ ఉన్నాయి. నాణేనికి రెండు కోణాలు ఉన్నట్లే.... మత మార్పిడికీ రెండు కోణాలు ఉన్నాయి. ఎవరి అనుభవాలు వారివి. అవీ ఇవీ... అన్నీ... (వారివారి అభ్యర్థన మేరకు కొందరి పేర్లు మార్చాం)

12 రోజుల క్రితం రాజమండ్రి కోటిపల్లి బస్‌స్టాండ్‌లో బస్సు దిగాం. కాసేపటికి ముగ్గురు ఆడవాళ్లు మాకు ఎదురుగా వచ్చారు. 'మతం మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీకు ఆర్థికంగా కూడా బాగుంటుంది' అని చెప్పారు. 'మాకు అలాంటి ఉద్దేశం లేదు' అని చెప్పి ముందుకు నడిచాం. కానీ, వాళ్లు మమ్మల్ని వదల్లేదు. 'ఒక్కసారి ఆలోచించండి. ఈ పుస్తకాలు చదివితే మతం గురించి అర్థమవుతుంది' అని కొన్ని పుస్తకాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. 'మాకు అవసరం లేదు. మమ్మల్ని వదిలేయండి' అని ముందుకు నడిచినా వారు వదిలిపెట్టలేదు. గట్టిగా కోప్పడటంతో వెళ్లిపోయారు. కోటిపల్లి బస్‌స్టాండ్‌లో మా చుట్టాల్లోనూ కొందరికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. - సరస్వతి, హైదరాబాద్

మా అమ్మాయిని ఇప్పించండి..
 
దాదాపు 50 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నాం. మాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు. చిన్నమ్మాయిని బాగా చదివించా. హైదరాబాద్ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తూ ఉండేది. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాం. ఈ ఏడాది జులైలో ఒక రోజు ఊరు వెళ్తున్నానని చెప్పింది. మర్నాడు మాకు చెన్నై నుంచి ఫోన్ వచ్చింది. 'నాన్నా.. నేను నన్‌గా మారిపోతున్నా. దానికున్న కారణాలన్నీ ఆరు పేజీలు ఉత్తరంలో రాసి ఉంచాను' అని చెప్పింది.

మాకు షాక్ కొట్టినట్లయింది. వెంటనే బయలుదేరి చెన్నై వెళ్లాం. మా అమ్మాయిని చూడటానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా వేచి ఉండాల్సి వచ్చింది. సాయంత్రానికి మా అమ్మాయి బయటకు వచ్చింది. తెల్లటి దుస్తులు వేసుకుంది. ఆమెను చూడగానే ఏడుపొచ్చింది. ఆమెతో ఏకాంతంగా మాట్లాడదామంటే.. చుట్టూ కాపలా! ఇక లాభం లేదని వాళ్లతో గొడవ పడ్డాను. అప్పుడు లోపలి నుంచి ఒకాయన వచ్చి నా చేతిలో ఓ కాగితం పెట్టాడు.

తాను మేజర్‌నని.. ఇష్టపూర్వకంగా మతం మార్చుకున్నానని.. తల్లిదండ్రులు (మేము) బలవంతంగా తీసుకువెళ్లిపోయే అవకాశం ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని కోరుతూ చెన్నై పోలీస్ కమిషనర్‌కు మా అమ్మాయి రాసిన ఉత్తరం అది. దాన్ని చూసి మరోసారి షాక్‌కి గురయ్యాను. నాకు, మా అమ్మాయికి ఎటువంటి విభేదాలు లేవు. అందరం అప్యాయంగా ఉండేవాళ్లం. అలాంటిది నామీద పోలీస్ కమిషనర్‌కు ఉత్తరం ఎలా రాస్తుంది. కొద్దిసేపు ఆమెను బతిమాలాం. కన్నీళ్లు పెట్టుకున్నాం. మా అమ్మాయి కూడా ఏడ్చింది. కానీ, నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు. ఇక చేసేదేమీ లేక తిరిగి వచ్చాం.

ఆమె బట్టలు, సెల్‌ఫోన్లు అన్నీ తిరిగి ఇచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్‌లో చూస్తే- "నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి కాబట్టి దేవుడు నిన్ను ఎంపిక చేశాడు. దేవుడి సేవలో ఉన్న ప్రశాంతత మరెక్కడా లేదు. కొన్ని కోట్ల మందిలో నీకు మాత్రమే ఆ అదృష్టం దక్కింది. ప్రభువు సేవ చేసుకొని తరించుకుందుగాని రా!'' అనే అర్థంలో అనేక మెసేజ్‌లు ఉన్నాయి. దీనిపై కేసు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని.. చర్చి అధికారుల ద్వారానే ప్రయత్నించాలని ఒక న్యాయవాది చెప్పారు.

మల్కాజ్‌గిరిలో ఒక చర్చి దగ్గరకు పంపాడు. నేను ఈ ప్రస్తావన తెచ్చిన వెంటనే వారు 'ఆ విషయాలు మాకు తెలియవు..' అంటూ లోపలికి వెళ్లిపోయారు. 'మీ అమ్మాయి నన్‌గా మారిందిట కదా..' అని బంధువులు అడిగితే మొదట్లో బాగా కోపం వచ్చేది. తర్వాత... కోపం తగ్గింది. బాధ మాత్రం తగ్గలేదు. మా అమ్మాయిని ఎందుకు ఆకర్షించాల్సి వచ్చింది? ఆమె చేత మతం మార్పించే హక్కు ఎవరిచ్చారు? దయనీయమైన పరిస్థితి ఏమిటంటే... నేను మా అమ్మాయిని తిరిగి తెచ్చుకోలేను.. అలాగని కేసు పెట్టలేను.
- వరదరాజులు, హైదరాబాద్

అమెరికాలో మార్పించారు..
నాకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె స్రవంతి 2002లో సత్యం కంప్యూటర్స్‌లో చేరింది. మూడే ళ్లు పనిచేశాక అమెరికా పంపించారు. అక్కడికి వెళ్లిన కొద్దికాలానికే పని ఒత్తిడితో బాధ పడుతున్న ఆమెను, సహోద్యోగులు, స్థానిక చర్చి ఫాదర్ కలిసి ఏసును నమ్మితే స్వాంతన చేకూరుతుందని నమ్మించారు. బాప్టిజం ఇప్పించారు.

ఇండియాకి వచ్చాక ఉద్యోగం మానేసింది. అదేమని ప్రశ్నిస్తే... ప్రభువే అన్నీ చూసుకుంటాడని చెప్పింది. పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం చేయడం పాపం అని చెప్పింది. భువనేశ్వర్‌లో మానసిక వైద్యుడి వద్ద ఏడాదిన్నర చికిత్స చేయించాం. బాగానే కోలుకుంది. దాంతో విశాఖపట్నం తీసుకొచ్చి నా దగ్గరే వుంచా. అన్నీ మరిచిపోయినా ప్రభువుని మాత్రం గుర్తుంచుకొంది. రెండేళ్ల తరువాత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. వెతికి తీసుకొచ్చాం.

మళ్లీ రెండుసార్లు అలా పారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్‌లో కైస్తవుల వద్దే ఉన్నట్లు తెలిసింది. చదువుకున్న వారిని కూడా ఇలా మాయచేసి, మతం మార్పించడం దారుణం. ఆ బాధ ఓ తండ్రిగా నాకు తెలుసు. ఇతర మతాల్ని ద్వేషించాలని ఏ మతమూ చెప్పదు. కానీ... ఒక లక్ష్యంతో మిషనరీ ఏర్పాటుచేసి మతం మార్చే పనిలో పడ్డారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే. - సోమయాజుల త్యాగరాజ శాస్త్రి, హోమియో వైద్యుడు, విశాఖపట్నం

మళ్లీ మారాను...
 
కొన్నేళ్ల క్రితం నాకు బాగా జబ్బు చేసింది. మతం మారితే స్వస్థత చేకూరుతుందని ఇరుగు పొరుగు, ఆ మత పెద్దలు వచ్చి చెప్పారు. ఆరోగ్యం బాగు పడుతుందన్న ఆశతో మతం మార్చుకున్నాను. రెండేళ్లు శ్రద్ధగా ప్రార్థనలు చేశాను. అయినా, ఫలితంలేదు. దీంతో... తిరిగి మునుపటి మతంలోకి మారిపోయాను. - సత్యవతి, రాజోలు మండలం (తూర్పు గోదావరి)

మిషనరీలతో గ్రామాల్లో మార్పులు
 
ఒకప్పుడు డబ్బులిచ్చి మతాన్ని మార్పించే వారు. ఇప్పుడు మిషనరీల ద్వారా విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి జరుగుతుండటంతో మత మార్పిడులు జరుగుతున్నాయి. ఇందులో ఎవరి బలవంతమూ లేదు. క్రిస్టియన్లు బైబిల్ చదివినా చర్చికి వెళ్లినా స్వస్థత చేకూరుతుందని నమ్మకం.
-జ్యోతుల క్రిస్టియన్ రాజు, ప్రధానోపాధ్యాయుడు, శ్రీకాకుళం జిల్లా

"ఎన్నాళ్లు ఇలా పేదలుగా ఉంటారు? మా మతంలోకి మారితే ఇళ్లు ఇస్తాం. అన్ని విధాలుగా బాగా చూసుకుంటాం. రండి... అని ఓ పెద్దాయన చెప్పాడు. ''ఇదీ హైదరాబాద్‌కు చెందిన రాంబాయి చెప్పిన విషయం. మతం మార్చేందుకు చేసే ప్రయత్నాల్లో ఇదొకటి! ఇలా ఇంకెన్నో!
వివరాలు రేపటి సంచికలో!
 
Courtesy : Andhra Jyothy

No comments:

Post a Comment