Saturday, November 12, 2011

మత బిల్లుకు వ్యతిరేకంగా హిందూ చైతన్య యాత్రలు -- ప్రవీణ్ తొగాడియా

ఆంధ్రభూమి బ్యూరో


హైదరాబాద్, నవంబర్ 11: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెస్తున్న మతబిల్లు వల్ల కొంప మునుగుతుందని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా హిందువులు, సాధు సంత్‌లను సంఘటిత పరుస్తామని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ భాయ్ తొగాడియా చెప్పారు. కోస్తాంధ్ర పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తొగాడియా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. 



కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇటీవల ప్రతిపాదించిన మత హింస నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా హిందువులు ఉద్యమించాలని అన్నారు. ఈ బిల్లుకు శాస్ర్తియ ప్రాతిపదిక లేదని అన్నారు. జాతీయ సలహా మండలి సభ్యుల ప్రతిపాదన ఆధారంగా మత హింస నిరోధక బిల్లును ఎలా తెస్తారని ప్రశ్నించారు. 


హిందువులను నేరస్థులుగా మార్చాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ, యుపిఎ ప్రయత్నిస్తోందని, ఇదంతా సోనియా గాంధీ కుట్ర అని ఆరోపించారు. అందరికీ ఒకే న్యాయం జరిగేలా చూడాల్సిన ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. ‘మత బిల్లు’ను అంతా వ్యతిరేకిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎంతో ఇష్టంగా ఉందని, దీనిని అంతర్జాతీయ న్యాయ శాస్త్రాలు సైతం వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. 


మత ఘర్షణలు జరిగితే ఎక్కువగా నష్టపోయే హిందువులకు ఈ బిల్లులో ఎలాంటి రక్షణ లేదని వ్యాఖ్యానించారు. 


దేశంలో గోవధ నిషేధ చట్టం తెచ్చినా కేంద్రం దానిని అమలుచేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో యధేచ్ఛగా 30వేల గోవులను వధించారని ఆరోపించారు. గుజరాత్ అల్లర్ల కేసులో శిక్ష పడ్డ 32 మందీ అమాయకులని, వారు నిర్దోషులుగా విడుదల అవుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. 


భారతీయ చట్టాల ప్రకారం ఇతర దేశాల పౌరులకు ఇక్కడ మత ప్రచారం చేసే హక్కు లేదని అయినా పట్టించుకునే నాధుడే లేడని విమర్శిణచారు. చట్టాల్ని అమలుచేయలేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

http://www.andhrabhoomi.net/state/m-464

No comments:

Post a Comment