Monday, November 21, 2011

పాక్ హిందువుల్లో అభద్రతా భావం -- రోజురోజుకు పెరిగి పోతున్న వలసలు

కరాచీ, నవంబర్ 20: పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో ఇటీవల ముగ్గురు హిందువుల హత్య, మరి కొందరి అపహరణ సంఘటనలు పాకిస్తాన్‌లోని హిందువుల్లో నెలకొని ఉన్న అభద్రతా భావాన్ని మరోసారి ఎత్తి చూపించాయని పాకిస్తాన్‌లోని హిందూ సంస్థల నేతలు అంటున్నారు.

హిందువుల పట్ల వివక్ష, పెద్ద మొత్తాల కోసం కిడ్నాప్‌లు, బెదిరించి డబ్బులు దోచుకోవడం, బలవంతపు మత మార్పిడులు లాంటి సంఘటనల కారణంగా చాలామంది హిందువులు విదేశాలకు వలస పోతున్నారని, రోజురోజుకు ఈ వలసలు పెరిగిపోతున్నాయని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్, పాకిస్తాన్ హిందూ సేవ లాంటి పలు హిందూ సంఘాల నేతలు అంటున్నారు. ‘హిందువుల్లో నెలకొని ఉన్న అభద్రతా భావం కారణంగా ఈ వలసలు ఎంత వేగంగా జరుగుతున్నాయో ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు’ అని పాకిస్తాన్ హిందూ సేవ అధ్యక్షుడు సంజేష్ కుమార్ అంటున్నారు. స్థూల అంచనాల ప్రకారం ప్రతి నెలా పాకిస్తాన్‌నుంచి ఎనిమిదినుంచి పది హిందూ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నాయని, వీరిలో చాలా మంది మధ్య తరగతి లేదా సంపన్న వర్గాలకు చెందిన వారేనని ఆయన అంటున్నారు.

పేదలు, తక్కువ ఆదాయాలు వచ్చే హిందువులకు ఇక్కడే ఉండడం తప్ప మరో దారి కనిపించడం లేదని కూడా ఆయన చెప్పారు. శతాబ్దాలుగా సింధ్ రాష్ట్రంలో తమ మూలాలు ఉన్న కుటుంబాలు కూడా వేరే ప్రాంతాలకు వలస వెళ్తూ ఉండడం బాధాకరమని కుమార్ అన్నారు.

అనధికారిక లెక్కల ప్రకారం పాకిస్తాన్‌లో దాదాపు 70 లక్షల మంది సిందులున్నారు. వీరిలో చాలామంది సింధ్ రాష్ట్రం లేదా ఖైబర్ ఫక్తూన్‌ఖావా రాష్ట్రంలోనే ఉంటున్నారు. హిందువులు వలసపోవడం పాకిస్తాన్‌కు నష్టమని, ఎందుకంటే భారత్‌సహా ఇతర దేశాలకు వలస వెళ్లే వారిలో చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లులాంటి అపొఫెషనల్స్, వ్యవసాయ కూలీలు లేదా ప్రధాన వ్యాపారాలు చేసే వారేనని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్‌కు చెందిన అధికారి ఒకరు చెప్పారు.

ఇది పాకిస్తాన్‌కు మేధోవలసతో సమానమని, మిగతా పాకిస్తానీలకు లభించే రక్షణ, హక్కులు తమకు లభించడం లేదనే కారణంగానే వీరంతా వలస పోతున్నారని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ వ్యవస్థాపకుడు రమేష్ కుమార్ అభిప్రాయ పడ్డారు.
కాగా, జనరల్ జియావుల్ హక్ 11 ఏళ్ల మిలిటరీ పాలన సమయంలో మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల పరిస్థితిలో మార్పు వచ్చిందని రాజకీయ విశే్లషకులు, సామాజిక శాస్త్ర నిపుణులు అంటున్నారు. జియా పాలనకు ముందు పరమత సహనం ఉండేదని, హిందువులు తమ పొరుగువారితో కలిసి ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా జీవించే వారని, అయితే జియా హయాంలో తీవ్రవాదం, ఇతర మతాల వారి పట్ల అసహనం పెరిగి పోయాయని, మైనారిటీ వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు దాడులు చేయడం ప్రారంభమయిందని మాజీ జాతీయ క్రీడాకారుడయిన మొహిందర్ కుమార్ ఆ రోజులను గుర్తుకు చేసుకుంటూ అన్నారు.

http://www.andhrabhoomi.net/international/p-047

No comments:

Post a Comment